తమపై ఫిర్యాదు చేశాడని ఓ ఆర్టీఐ కార్యకర్తపై మద్యం మాఫియా దాడికి పాల్పడింది. అతడిని దారుణంగా హింసించడమే కాక.. రెండు కాళ్లకు మేకలు దింపారు. చనిపోయాడని బావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ క్రూరమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాడ్‌మేడ్ జిల్లాలో అమరా రామ్ గోదారా నివసిస్తున్నాడు. అతడు ఆర్టీఐ కార్యకర్త. గ్రామపంచాయతీ పరిధిలో అవినీతి, మద్యం అక్రమ అమ్మకాలపై ఫిర్యాదు చేశారు.
ఈ విషయం మద్యం మాఫియాకు తెలిసి ఈ నెల 21న ఆయన్ను కిడ్నాప్ చేసింది. అనంతరం అతడిపై ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టారు. కాళ్లు, చేతులను విరగొట్టారు. ఆపై రెండు కాళ్లలో మేకులు దిగ్గొటారు. అతడు చనిపోయాడని బావించి గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన పడేశారు. తీవ్రగాయాలతో పడి ఉన్న ఆయన్ను గుర్తించిన గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జోధ్‌పూర్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోదారా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీఐ కార్యకర్తపై దాడిని రాష్ట్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి.. గోదాదా ద్వారా విషయాన్ని తెలుసుకున్నారు. కారులో 8 మంది వచ్చి తనను అపహరించినట్లు అతడు చెప్పాడు. దీనిపై పోలీసులు అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.