ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. ఉన్నతాధికారుల వేదింపులే కారణం..!
RTC Driver Suicide in Chevella.చేవేళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్(38) ఆత్మహత్యకు
By తోట వంశీ కుమార్ Published on 25 Sept 2022 11:19 AM ISTచేవేళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్(38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల వేధింపులే బలవన్మరణానికి కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెహదీపట్నం డిపోలో అశోక్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడు నడుపుతున్న కార్గో బస్సు డ్యామేజి కావడంతో ఉన్నతాధికారులు డ్రైవర్ విధుల నుంచి తొలగించారు. డిపో వద్ద రాత్రి పూట పార్కింగ్ పనిని అప్పగించారు. పగలు విధులు ఇవ్వాలంటే బస్సు డ్యామేజికి పెనాలిటీ మొత్తం కట్టాలని అధికారులు వేదిస్తున్నారని భార్య లావణ్య ముందు అశోక్ వాపోయాడు.
విధులు ముగించుకుని శనివారం ఉదయం ఇంటికి వచ్చాడు. భార్యను పొలం వద్ద దింపి వచ్చాడు. కాసేపటి తరువాత ఆమెకు ఫోన్ చేసి 'ఉరి వేసుకుంటున్నా పిల్లలను జాగ్రత్త' అంటూ పెట్టేశాడు. ఆందోళనకు గురైన లావణ్య ఇంటికి వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అవాస్తవం..
వేదింపులకు గురి చేశామనడం అవాస్తం అని మెహదీపట్నం డిపో మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు. అశోక్ ఈ నెల 21న విధులు నిర్వహించి ఇంటికి వెళ్లాడు. 22న వీక్లీ ఆఫ్ కావడంతో రాలేదు. బస్సు డ్యామేజి అయిందని తెలిసి 23న పార్కింగ్ వద్ద రాత్రి డ్యూటీ వేశాం. వేధింపులకు గురి చేశామనడం అవాస్తం అని అన్నారు.