మహారాష్ట్రలో తన భార్య మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిన దొంగలను వెంబడించాడో వ్యక్తి. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిపై దొంగలు రాయితో దారుణంగా దాడి చేశారు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం నాడు బాధితుడు హేమంత్ గవాండే తన భార్యతో రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అక్కడ కొంతమంది దుండగులు ఆమె మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించారు. గవాండే నిందితులను వెంబడించగా, వారు అతనిపై దాడి చేశారు.
తీవ్రంగా కొట్టిన తర్వాత, వారు అతని ముఖాన్ని రాళ్లతో కొట్టారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు అతన్ని అకోలాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఈ సంఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు స్థానిక క్రైమ్ బ్రాంచ్ (LCS), స్పెషల్ స్క్వాడ్ నుండి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ మనోజ్ బహురే తెలిపారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.