కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. సీఎం దిగ్భ్రాంతి
Road accident in Veldurthy.కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 14 మంది మృతి.
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2021 9:40 AM ISTకర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున టెంపో వాహనం అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మృత్యువాత పడగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వెలుతున్న టెంపో వాహనం అదుపుతప్పింది. డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది.
ఆ సమయంలో టెంపోలో 18 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో 14 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన చిన్నారులను సర్వజన ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో 8 మంది మహిళలు.. ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు.
వేగంగా ఢీ కొట్టడంతో.. టెంపో వాహనం నుజ్జునుజ్జు అయింది. దీంతో మృతదేహాలన్ని అందులో ఇరుక్కుపోయాయి. దీంతో క్రేన్‌ను తీసుకుని వచ్చి దాని సాయంతో టెంపో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా మదనపల్లి నుంచి రాజస్థాన్‌లోని ఆజ్మీర్ దర్గాకు వెలుతుండగా ప్రమాదం జరిగింది. టెంపో డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణ వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలిని పరిశీలించారు.