తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి దుర్మరణం చెందింది. కన్నతల్లి ఎదుటనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో తోట సుమన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య స్వరూప, చిన్నారి ఆద్య కలిసి ప్రత్తిపాడులోనే ఉంటున్నాడు. అయితే.. డ్యూటీ నిమిత్తం మూడు రోజుల పాటు అంతర్వేదికి వెళ్లాడు.
ఈ క్రమంలో తన కుమారై, మనుమరాలిని వేమగిరి తీసుకువెళ్లేందు సుమన్ అత్తగారు(భార్య తల్లి) ప్రత్తిపాడుకు వచ్చారు. ముగ్గురు కలిసి బైక్‌పై వేమగిరికి పయనమయ్యారు. ఈ క్రమంలో రాజానగరం చేరుకునే సరికి అతివేగంగా వస్తున్న ఓ వ్యాన్ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. తల్లి, అమ్మమ్మ ఓ వైపునకు పడిపోగా.. చిన్నారి ఆద్య మాత్రం వ్యాన్ చక్రాల కింద పడింది. వ్యాన్ చక్రాలు ఆద్యపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. వారిని ఢీ కొట్టిన వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది. తమ కళ్లెదుటే ఆద్య చనిపోవడాన్ని చూసిన తల్లి స్వరూప, అమ్మమ్మ రోదించిన తీరు అక్కడి వారిని తీవ్రంగా కలిచి వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.