యాత్రికులతో వెలుతున్న మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్‌లో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరంతా హరిద్వార్ నుంచి వస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.
కాగా..ఈ ప్రమాద ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.