అతి వేగం, మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడపరాదని ఎంత చెబుతున్నప్పటికీ కొద్ది మంది నిర్లక్ష్యం మూలాన నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అర్థరాత్రి ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. కాగా.. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
9 మంది మారుతి ఈకో వాహనంలో రామాయంపేట వైపు నుంచి నగరానికి వస్తున్నారు. మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలోకి వచ్చేసరికి.. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బావర్చీ హోటల్ ముందు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ఒకరు మృతి చెందగా.. మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోరా సింగ్, బిబ్బు సింగ్ లుగా గుర్తించారు. గాయపడిన మరో ఏడుగురిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. వీరంతా బ్రతుకుదెరువు కోసం మేడ్చల్ వచ్చి కూలీలుగా పనిచేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.