విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి
Road Accident in Kesamudram Mandal Four dead.కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి
By తోట వంశీ కుమార్ Published on 29 Oct 2022 8:37 AM ISTకారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల పల్లి మండలం గోల్య తండాకు చెందిన గుగులోతు బిక్కు(డ్రైవర్), ఆయన సోదరి బానోతు అచ్చాలి(38), బావ భద్రు(45), కోడలు సుమలత, మనవడు దీక్షిత్‌తో కలిసి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీప్ దర్గాకు కారులో వెళ్లారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన వారి బంధువులు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న అనంతరం శుక్రవారం సాయంత్రం తిరుగుప్రయాణం అయ్యారు.
కాగా.. ఇదే వేడుకకు వచ్చిన మహబూబాబాద్‌లోని భవానీగర్ తండాకు చెందిన గుగులోతు లలిత(45), తొమ్మిదోతరగతి చదువుతున్న ఆమె కుమారుడు సురేశ్(15) తాము కూడా వస్తామని అడగడంతో వారిని ఎక్కించుకున్నారు. కారు కేసముధ్రం బైపాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో భద్రునాయక్, అతడి భార్య హచ్చాలి, గుగులోతు లలిత, ఆమె కుమారుడు సురేష్ మరణించారు.
ముందు సీటులో కూర్చున్న డ్రైవర్ బిక్కు, భద్రునాయక్ కుమారై సుమలత, ఆమె 18 నెలల కుమారుడు దీక్షిత్ ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాదాపు రెండుగంటల పాటు శ్రమించి క్రేను సాయంతో బావిలోంచి కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ముగ్గురి ప్రాణాలు కాపాడిన విద్యార్థులు
కేసముద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సిద్ధు, బుర్ర రంజిత్‌లు మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చారు. అదే సమయంలో కారు బావిలో పడి శబ్ధం రావడంతో బావి వద్దకు పరుగులు తీశారు. కారు మునిగిపోతుండగా.. అందులో ఉన్న వ్యక్తులు అద్దాలను చేతులతో బద్దలు కొట్టేందుకు యత్నించడాన్ని గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బావిలోకి దూకి కారు ముందు డోర్ అద్దాలను బద్దలు కొట్టారు.
డ్రైవర్ బిక్కు బయటకు రాగా.. సుమలత, ఆమె రెండేళ్ల కుమారుడిని వారు ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కారు నీటిలోకి మునిగిపోయింది. ఇద్దరు విద్యార్థులు ప్రాణాలకు తెగించి సాయం చేయడంతో ముగ్గురి ప్రాణాలు దక్కాయని స్థానికులు విద్యార్థులను అభినందించారు.