కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. పెళ్లింట విషాదం
Road Accident in kamareddy district.మరో అరగంలో పెళ్లి.. ఇంతలో లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2021 9:31 AM GMT
మరో అరగంలో పెళ్లి.. ఇంతలో లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. లారీ అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తా పడి 15 మందికి గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామం వద్ద చోటు చేసుకుంది.
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన మల్లమారి పెద్ద సాయిలు కూతురు మల్లికకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహాం నిశ్చమైంది. నేడు వివాహం జరగనుండగా.. అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు 20 మంది ట్రాక్టర్‌లో పెళ్లి సామానుతో తాడ్వాయి మీదుగా బయలుదేరారు. పెళ్లికి మరొక అరగంట సమయం ఉందనగా.. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో పెద్దమ్మ ఆలయం మూలమలుపు వద్ద.. లారీ వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాశవ్వ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.