గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెలుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన యడ్లపాడు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్డెర కాలనీలకు చెందిన 14 మంది మహిళా వ్యవసాయ కూలీలు పత్తితీత పనుల కోసం పత్తిపాడు మండలం తుమ్మలపాలెంకు ఆటోలో బయలుదేరారు. అయితే.. వీరు ప్రయాణీస్తున్న ఆటో యడ్లపాడు వద్దకు రాగానే వెనుక నుంచి ఓ వాహానం ఢీ కొట్టింది. ఆటో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది మహిళలను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి చెందారు. వీరిని షేక్ దరియాబి(55), బేగం(52)గా గుర్తించారు. ఇక మిగిలిన ఏడుగురిలో మీనాక్షి అనే మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.