శనివారం తెల్లవారుజామున ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. నేపాల్ నుంచి గోవాకు వలస కార్మికులతో ఓ బస్సు బయలుదేరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలోని మహాంగుపూర్ సమీపానికి వచ్చే సరికి బస్సు టైర్ పంచర్ అయింది. దీంతో బస్సును రోడ్డు పక్కకు నిలిపారు. బస్సు టైర్ మారుస్తుండగా తెల్లవారుజామున 3.30గంటల సమయంలో బస్సును వెనుక నుంచి ఓ ట్రక్కు ఢీ కొట్టింది.
ఆ సమయంలో బస్సులో 60 మంది ఉన్నారు. వారిలో నలుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. మిగిలిన ప్రయాణీకులు సరక్షితంగా ఉన్నారని, వారిని నేపాల్‌కు పంపే ప్రక్రియ చేపట్టినట్లు సీనియర్ పోలీస్ అధికారి పూర్ణేందు సింగ్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి చేపట్టినట్లు వివరించారు.