12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం జరిగింది. ఫలితంగా ఓ బిడ్డకు జన్మిచ్చింది. పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. తన తల్లిని వెతుకుంటూ వచ్చాడు. తన తండ్రి ఎవరు అంటూ తల్లిని ప్రశ్నించాడు. దీంతో తన సంతానానికి తండ్రి పేరేం చెప్పాలని ప్రశ్నిస్తూ ఆ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అది కూడా అత్యాచారం జరిగిన 27 సంవత్సరాల తరువాత. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 27 సంవత్సరాల క్రితం బాధితురాలు తన అక్కా బావలతో కలిసి షహనాజ్‌పూర్‌లో నివాసం ఉండేది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు. ఓ రోజు బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన నాకీ హాసన్ అనే వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అతని తమ్ముడు గుడ్డు కూడా అత్యాచారం చేశాడు. ఆతరువాత కూడా వీరిద్దరు పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కోంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. 1994లో ఓ కుమారుడికి జన్మనిచ్చింది. తన సొంతగ్రామమైన ఉదంపూర్‌కి చెందిన ఓ వ్యక్తికి ఆ బాలుడిని ఇచ్చేసింది. ఆమె బావకు రాంపూర్‌కు బదిలీ కావటంతో అక్కడకు మకాం మార్చారు. కొన్నాళ్లకు ఖాజీపుర్ కు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
అయితే.. లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిన ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో మళ్లీ ఆమె ఉదంపూర్ వచ్చి అక్కడే ఉంటోంది. పెరిగి పెద్దవాడైన బాధితురాలి కొడుకు..తల్లిదండ్రుల గురించి ఆరా తీశాడు. ఈ క్రమంలో తల్లి గురించి తెలుసుకుని ఆమెను కలుసుకున్నాడు. తండ్రి ఎవరని అడుగగా.. తనకు జరిగిన దారుణాన్ని కుమారుడికి చెప్పింది. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించి సదర్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు నిందితులపై కేసు పెట్టింది. కాగా.. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి మొదట పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించటంతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె కుమారుడికి డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు.