రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో గ్రామస్థులు ఓ వ్యక్తిని పట్టుకుని, చెట్టుకు కట్టేసి, కొట్టి, నోటిలో మూత్రం కూడా పోశారు. ఓ అమ్మాయిని కలవడానికి వచ్చిన వ్యక్తిని దారుణంగా హింసించారని పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద ఆ వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు ఆదివారం రాత్రి సమీప గ్రామంలోని బాలికను కలిసేందుకు వచ్చినట్లు సమాచారం. గ్రామస్తులు, బాలిక కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సమాచారం అందుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని వదిలిపెట్టాలని వేడుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వైరల్‌గా మారిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (జలోర్) హర్షవర్ధన్ తెలిపారు."ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి ఎవరూ ముందుకు రానప్పటికీ, మేము బాధితుడిని గుర్తించి సంప్రదించాము. అతని నుండి ఎఫ్‌ఐఆర్ తీసుకున్నాము" అని హర్షవర్ధన్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతను కలవడానికి వెళ్లిన అమ్మాయి అతడిపై పోక్సో చట్టం కింద కూడా ఫిర్యాదు చేసిందని, ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసు అధికారులు చెప్పారు.