ఒకే అమ్మాయిని ప్రేమించిన బ్రదర్స్.. మా లవర్‌కు పెళ్లిచేయండి.. ఆత్మహత్య
Rajasthan cousins in love with the same girl kill themselves.ఇటీవల యువత చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య
By తోట వంశీ కుమార్ Published on 9 March 2021 12:08 PM ISTఇటీవల యువత చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయి కాదు అని చెప్పిందనో.. తాను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి జరిగిందనో బలవన్మరణానికి పాల్పడుతూ.. కన్న వారికి కడుపు కోతను మిగులుస్తున్నారు. తాజాగా ఇద్దరు అన్నాదమ్ములు ఒకే అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ఏం జరిగిందో తెలీదు కానీ.. వారిద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తాము ప్రేమించిన అమ్మాయికి మంచి అబ్బాయితో పెళ్లి చేయాలని చనిపోయే ముందు వీడియోలో తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుంది జిల్లాలోని కేశవ్‌పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్(23), దేవ్‌రాజ్ గుర్జర్(23) వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించారు. ఆ అమ్మాయి పేరును ఇద్దరూ పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. ఆ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తరువాత గానీ తెలియదు ఇద్దరూ ప్రేమిస్తుంది ఒకరినే అని. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. గుడ్ల గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరికి సంబంధించి మొబైల్ ఫోన్‌లో ఒకే అమ్మాయికి సంబంధించి ఫోటోలు ఉండటంతో పోలీసులు ఈ దిశగా విచారణ చేపట్టారు. ఫోన్ సంభాషణలు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా ఇద్దరూ ఆ యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా.. ఈ ఘటన తరువాత ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. కాగా.. వారు ఆత్మహత్య చేసుకునే ముందు ఓ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలో.. మా చావుకు ఎవరూ కారణం కాదని.. తాము ప్రేమించిన అమ్మాయికి ఓ మంచి అబ్బాయితో పెళ్లి చేయాలని ఆ వీడియోలో వారు కోరారు.