హైదరాబాద్ శివారులోని పోచారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్లతో గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన ఫస్ట్ ఇయర్ విద్యార్థి జాదవ్ సాయి తేజ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయితేజ (19) సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
కాలేజీ దగ్గరల్లో ఉన్న మధు బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. కాలేజీలో అతడికి సీనియర్ విద్యార్థులో గొడవ జరిగింది. దీంతో సాయితేజ తీవ్ర మనస్తాపం చెందాడు. హాస్టల్‌లో ఉరివేసుకుని చనిపోయాడు. సీనియర్స్ వేధింపులు, డబ్బుల కోసం టార్చర్ తట్టుకోలేక చనిపోతున్నానంటూ అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దాన్ని కుటుంబీకులకు, స్నేహితులకు పంపి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.