సీఎంవో ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ పేరుతో మోసాలు.. కేటుగాడు అరెస్ట్

లంగాణ సీఎంవో ప్రొటోకాల్‌ అడ్వైజర్‌నంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు.

By అంజి  Published on  10 Dec 2023 9:30 AM IST
Rachakonda Police, Arrest, Fake Protocol Officer, Telangana Cmo

సీఎంవో ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ పేరుతో మోసాలు.. కేటుగాడు అరెస్ట్

సీఎంవో కార్యాలయంలో ఓ కేటుగాడు మోసాలకు పాల్పడుతూ పోలీసుల చేతికి చిక్కాడు. హైదరాబాద్ నగరంలో రకరకాల సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్‌లో ప్రోటోకాల్ ఆఫీసర్ అంటూ పలువురిని పలు రకాలుగా మోసాలు చేస్తూ వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు కాజేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం జిల్లాలోని తణుకు మండలంలో ఉన్న అత్తిలి గ్రామానికి చెందిన బుసి ప్రవీణ్ సాయి అనే వ్యక్తి ప్రస్తుతం వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్ లో దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్ గా అవతారం ఎత్తి పలువురికి సీఎం ప్రోటోకాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించాడు. అంతే కాదండోయ్ ఈ ఘనుడు ల్యాండ్ సెటిల్మెంట్, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ పలువురిని మోసం చేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు దోచుకున్నాడు.

అంతటితో ఆగకుండా హోమ్ మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ ప్యాడ్ తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకమైన జనాలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆరు నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి వారందరి నెత్తిమీద శఠగోపం కూడా పెట్టాడు. ఈ విధంగా ఈ నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ చేతిలో చిక్కి మోసపో యిన బాధితులందరూ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్ పై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7వ తేదీన ఓ బాధితుడు డ్రైవర్ అనిల్ కు నిందితుడు ప్రవీణ్ సాయి పరిచయం ఏర్పడింది. తనను తాను సీఎం ఆఫీసులో ప్రోటోకాల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నానంటూ నిందితుడు ప్రవీణ్ సాయి పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా తన ఐడీ కార్డును చూపించి ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఇప్పిస్తానని గండి మైసమ్మ గుడి వెనక ఉన్న స్థలం చూపించాడు.

అతడి కల్లబొల్లి కబుర్లు నమ్మిన ఫిర్యాదారుడు రూ.25 లక్షలకు భూమిని కొనుగోలు చేసేందుకు డీలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే అడ్వాన్సుగా నిందితుడి ఫోన్ కు ఫోన్ పే ద్వారా 2,10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆరు లక్షల రూపాయలు నిందితుడు ప్రవీణ్ సాయి చేతికి ఇచ్చాడు. అనంతరం అది ప్రభుత్వ భూమి కాదని ఒక ప్రైవేటు వ్యక్తిదని తెలుసుకొని తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఇలా సీఎంఓ ఆఫీసులో తెలంగాణ సీఎం పబ్లిక్ సెల్లో ప్రోటోకాల్ ఆఫీసర్ గా చలామణి అవుతూ పలువురిని మోసగించి లక్షల్లో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న ప్రవీణ్ సాయిని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు అంబర్ పేటలోని ఓఆర్ఆర్ సమీపంలోని సంపూర్ణ హోటల్లో అరెస్టు చేసి అతని వద్ద నుండి ఇన్నోవా కార్ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Next Story