ప్రియురాలికి బర్త్ డే గిఫ్ట్‌గా.. ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
Quarrel with girlfriend over birthday gift. Student commits suicide in tamilnadu. బర్త్ డే గిఫ్ట్ విషయంలో గొడవ జరిగింది. దీంతో ప్రియురాలిని బెదిరించి కాలేజీ విద్యార్థి ఉరేవేసుకున్నాడు.
By అంజి Published on 27 Nov 2022 4:27 PM ISTబర్త్ డే గిఫ్ట్ విషయంలో గొడవ జరిగింది. దీంతో ప్రియురాలిని బెదిరించి కాలేజీ విద్యార్థి ఉరేవేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నైలోని అన్నానగర్ వెస్ట్‌కు చెందిన సతీష్ - సెల్వరాణి దంపతులు. వీరి కుమారుడు మోహన్ (19). అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం బయటకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా మోహన్ ఉరివేసుకుని మృతి చెంది ఉండటంతో షాక్‌కు గురయ్యారు.
దీనిపై సమాచారం అందుకున్న నోలంపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మోహన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మోహన్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో చనిపోయే ముందు చివరిసారిగా ఓ మహిళతో మాట్లాడినట్టు తెలిసింది. ఆ సంభాషణలో మోహన్ ఉరివేసుకుని చస్తానని కాల్ కట్ చేసినట్లు తేలింది. ఆ మహిళ చెన్నైలోని పులియన్‌తోప్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
సదరు మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పోలీసుల తదుపరి విచారణలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తేలింది. గత ఏడాదిన్నర క్రితం మెరీనా బీచ్‌లో మోహన్‌కు యువతితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సెల్‌ఫోన్ల ద్వారా స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమికులిద్దరూ కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లి బహుమతులు ఇస్తూ సరదాగా గడిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల మోహన్‌కు, మహిళకు విభేదాలు రావడంతో సదరు మహిళ మోహన్‌తో మాట్లాడటం మానేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఆ మహిళ పుట్టిన రోజు కావడంతో మోహన్ ఆమెకు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
అప్పుడు మోహన్ ''నీకు ఏం గిఫ్ట్ కావాలి. ఇస్తాను'' అంటూ మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నీ కోసం ప్రాణం ఇస్తానని చెప్పి ఆ మోహన్ సెల్ ఫోన్ కనెక్షన్ కట్ చేశాడని తెలిసింది. దీంతో మోహన్ తన జీవితాన్ని తన స్నేహితురాలికి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుని ఇంట్లోని విద్యుత్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. విడిపోయిన ప్రియురాలిపై ప్రేమను నిరూపించుకునేందుకు తల్లిదండ్రులను, భవిష్యత్తును మరిచి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని దారుణమైన చర్యతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.