ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలకు విలువ ఇచ్చే వారు. అయితే ప్రస్తుతం డబ్బు కోసం ఎంతటి పనిని చేసేందుకైనా వెనుకాడడం లేదు. డబ్బు సంపాదించేందుకు కష్టపడడం మానేసి ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా ఆ పనిని చేస్తున్నారు. డబ్బు పై ఆశతో ఓ భర్త చేయకూడని పనిని చేశాడు. తన భార్య మానాన్ని అందరి ముందు పెట్టేశాడు. అందరి ముందు భార్యను వివస్త్రను చేసి..నగ్నంగా స్నానం చేయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పుణెలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంటి యజమాని వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే.. ఇటీవల కాలంలో అనుకున్నంత లాభాలు రావడం లేదు. క్షుద్రపూజ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని ఎవరో ఉచిత సలహా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు రావడంతో పాటు ఇంట సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు వస్తాయని ఓ మాంత్రికుడు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మాడు.
ఇందుకు అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. కట్టుకున్న భార్యను అందరి ముందు నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించాడు. భర్త ఒత్తిడికి తలొగ్గిన బాధితురాలు నిస్సహాస్థితిలో అతడు చెప్పినట్లే చేసింది. దీనిని చుట్టు ఉన్నవారు చూశారే తప్ప ఏ ఒక్కరు ఆపేందుకు యత్నించలేదు. భాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త, అతడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. మాంత్రికుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.