సాధారణంగా కొడుకు పట్ల తల్లికి ప్రేమ ఉండడం సహజం. తన కుమారుడు బాగా చదువుకుని ప్రయోజకుడు కావాలని కోరుకుంటుంది. కుమారుడి క్లాస్‌మెట్‌ను కొడుకులాగే చూసుకోవాలనే సోయి మరిచి ప్రవర్తించింది. తన కుమారుడి కంటే అతడి స్నేహితుడు బాగా చదువుతున్నాడని కోపం పెంచుకుంది. శీతలపానీయంలో విషం కలిపి ఆ విద్యార్థిని హత్య చేసింది. ఈ ఘటన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో శనివారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. కారైక్కాల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో రాజేంద్రన్, మాలతి దంపతుల కుమారుడు మణికందన్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం అతడు హఠాత్తుగా సృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అతడు విషం తాగినట్లు వైద్యులు తెలిపారు. సృహలోకి వచ్చిన తరువాత పాఠశాల సెక్యూరిటీ ఇచ్చిన శీతల పానీయం తాగిన తరువాతనే ఇలా జరిగిందని తల్లి దండ్రులకు చెప్పాడు.
వెంటనే బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తమదైన శైలిలో సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా.. ఓ మహిళ తనకు ఆ విద్యార్థికి శీతల పానియం ఇవ్వమని చెప్పడంతోనే ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి సహాయరాణి విక్టోరియా అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె చెప్పింది విని షాకైయ్యారు. ఎప్పుడు తరగతిలో ఫస్ట్ వచ్చే తనకుమారుడు ని పక్కకు తోసి రాజేంద్రన్-మాలతి ల కుమారుడు ఫస్ట్ వస్తున్నాడనే కోపంతోనే విషమిచ్చినట్లు చెప్పింది.
కాగా.. చికిత్స పొందుతూ అర్థరాత్రి మణికందన్ మరణించాడు.