ఇటీవల కాలంలో యువత చాలా సున్నితంగా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయనో లేద టీచర్ మందలించిందనో, అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ఫ్రెండ్ ఫోన్ ఎత్తడం లేదనో.. ఇలా చాలా చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపు కోతనే మిగులుస్తున్నారు. తాజాగా.. ఓ యువతి ఫోన్‌లో ఎక్కవు సేపు మాట్లాడుతోంది. గమనించిన ఆ యువతి తల్లి.. ఎక్కువ సేపు ఫోన్‌లో మాట్లాడొద్దని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబళ్లాపుర పట్టణంలో స్నేహ(18) అనే యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. స్నేహా ఓ ప్రైవేటు కళాశాలలో పీయూసీ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఇటీవల స్నేహా ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోంది. అది కూడా అబ్బాయిలతో గంటల తరబడి మాట్లాడేది. ఈ విషయం గమనించిన ఆ యువతి తల్లి.. అంత సేపు ఫోన్‌లో మాట్లాడవద్దని సున్నితంగా చెప్పింది. అయితే.. స్నేహ తల్లి మాటను పట్టించుకోకపోగా.. ఇంకా ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడేది. పలుమార్లు తల్లి చెప్పినప్పటికి స్నేహ తీరులో మార్పు రాలేదు.
దీంతో తల్లి ఈ సారి కాస్త గట్టిగానే మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన స్నేహ వారం క్రితం ఇంట్లో ఉన్నపురుగుల మందు తాగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన స్నేహను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం స్నేహ చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.