16 మందిని మ‌హిళ‌ల‌ను చంపిన సైకో.. చిన్న చీటి ప‌ట్టించింది

Psycho killed 16 women.ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసేవాడు. 16 మందిని మ‌హిళ‌ల‌ను చంపిన సైకో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2021 9:36 AM GMT
Psycho killed 16 women

ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసేవాడు. వారికి మాయ‌మాట‌లు చెప్పి న‌గ‌ర శివారుల్లోకి తీసుకువెళ్లి అత్యంత దారుణంగా హ‌త్య చేసేవాడు. ఇలా 16 మంది మ‌హిళ‌ల‌ను హ‌త్య చేసి పోలీసుల‌కు దొర‌క‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నాడు. కాగా.. అత‌డిని ఓ చిన్న చీటి పోలీసులకు ప‌ట్టించింది. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో న‌గ శివారుల్లోని అంకుషాపూర్ ద‌గ్గ‌ర స‌గం కాలిన మ‌హిళ మృత‌దేహాం ఉంద‌ని పోలీసుల‌కు స‌మాచారం వ‌చ్చింది. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ప‌రిస‌ర ప్రాంతాల‌ను గాలించినా.. మృతిరాలికి సంబంధించిన ఏ విధ‌మైన స‌మాచారం ల‌భించ‌లేదు.

ఆ మ‌హిళ‌ను గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేందుకు ముఖం పై పెట్రోలు పోసి త‌గ‌బెట్టాడంతో కేసును చేదించ‌డం పోలీసుల‌కు క‌ష్టంగా మారింది. అయితే.. ఆమ‌హిళ చీర కొంగుకు ముడి క‌నిపించింది. అది విప్పి చూడ‌గా.. అందులో ఓ చిన్న చీటి క‌నిపించింది. అందులో ఓ ఫోన్ నెంబ‌ర్ రాసి ఉంది. దాని ఆధారంగా ద‌ర్యాప్తు ప్రారంభించారు. అది నేరేడ్‌మెట్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఫోన్ నెంబ‌ర్‌గా తెలిసింది. వెంట‌నే అత‌డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ హ‌త్య‌తో త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పాడు. ఆమె పేరు వెంక‌ట‌మ్మ అని.. జూబ్లిహ్లిల్స్‌లోని వెంక‌ట‌గిరిలో ఉంటుంద‌ని చెప్పాడు.

రాచ‌కొండ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసుల‌ను సంప్ర‌దించ‌గా.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి వెంక‌ట‌మ్మ క‌నిపించ‌డం లేద‌ని కేసు న‌మోదైందని.. ఆ రోజు మ‌ధ్యాహ్నాం బేగంపేట‌లో ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అయిన‌ట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో సీసీ పుటేజీల‌ను ప‌రిశీలించగా.. ఆమె మ‌రో వ్య‌క్తితో క‌లిసి ఆటో ఎక్కిన‌ట్లు గుర్తించారు. ఆ వ్య‌క్తి ఫోటోను మృతురాలి కుటుంబ స‌భ్యుల‌కు చూపించ‌గా.. అత‌డెవ‌రో త‌మ‌కు తెలియ‌దని వారు చెప్పారు. చివ‌రికి ఓ చేప‌ల వ్యాపారి గుర్తు ప‌ట్ట‌డంతో.. ఎట్ట‌కేల‌కు నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అత‌డు చెప్పిన విష‌యాలు విని పోలీసులే ఆశ్చ‌ర్య‌పోయారు. వెంక‌ట‌మ్మ‌ను మాత్ర‌మే కాకుండా చాలా మంది మ‌హిళ‌ల‌ను హ‌త్య చేసిన‌ట్లు చెప్పాడు. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు 16 మందిని ఆ సైకో హ‌త‌మార్చిన‌ట్లు ప్రాథ‌మికంగా నిర్దారించారు. డ‌బ్బు కోసం చంపాడా.. లేక మ‌రే ఇత‌ర కార‌ణంగా చంపాడా అన్న‌ది తెలుసుకునే పనిలో ఉన్నారు.


Next Story
Share it