బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి తల్లిదండ్రులు కాబోతున్నాం అన్న వారి ఆనందం ఆవిరైంది. దాదాపు 8 గంటల పాటు మృత్యువుతో పోరాడిన గర్భిణి కన్నుమూసింది. ఈ హృదయ విదాకర ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ బాకారంలో సతీశ్‌గౌడ్, భార్య షాలిని(35) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఓ ఏడాది వయసు ఉన్న ఓ బాబు ఉన్నాడు. షాలిని ప్రస్తుతం రెండు నెలల గర్భిణి. హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రిలో రెగ్యులర్ చెకప్ కోసం బుధవారం ఉదయం ఆదంపతులు బైక్‌పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద ముషీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీ కొట్టింది.
బస్సు వెనుక చక్రాల కింద షాలిని, ఆమె భర్త కుడివైపు పడి ఉన్నారు. స్థానికుల అరుపులతో వెంటనే డ్రైవర్ బస్సును వెనక్కు తీశాడు. అప్పటికే షాలిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బస్సు వెనుక చక్రాలు ఆమె కడుపుపైకి ఎక్కడంతో రక్తం వరదలై పారింది. ఆమె పొట్ట భాగం నుజ్జుయింది. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేశ్ ఓ అంబులెన్స్ సాయంతో హైదర్‌గూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ తల్లి దాదాపు 8 గంటలపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. భర్త గాయాలతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు.