ఆడపిల్ల పుట్టే అవకాశం ఉందన్న కారణంతో అత్తమామలు కోడలిపై విష ప్రయోగం చేశారు. దీంతో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గర్భిణీ సోమవారం మృతి చెందింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన శ్రావణికి మండలంలోని సుబ్బయ్యపాలేనికి గ్రామానికి చెందిన గాడిపర్తి వేణుతో 2020లో వివాహమైంది. శ్రావణికి మొదటి ప్రసవంలోనే ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత శ్రావణి మళ్లీ గర్భం దాల్చింది. భర్త, అత్తగారు లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టబోతోందని తెలిసింది.
దీంతో శ్రావణి అత్తమామలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆడ పిల్ల పుట్టడం ఇష్టం లేకపోవడంతో అత్తమామలు కోడలికి మజ్జిగ, పాలలో విషం పోసి తాగించారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాదు శ్రావణి రక్తం, చిన్న పేగుల ముక్కలతో వాంతులు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఆమెను నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రావణి పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ జరుపుతామని ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు.