ఆడపిల్ల పుడుతుందనే భయంతో.. నిండు గర్భిణి ఆత్మహత్య.. తీరా చూస్తే
Pregnanat woman suicide in Manchiryal.తొలి కాన్ఫులో పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారికి మూడేళ్లు
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2022 10:02 AM IST
తొలి కాన్ఫులో పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారికి మూడేళ్లు. మళ్లీ ఆ తల్లి గర్భం దాల్చింది. గురువారం మరో బిడ్డను జన్మనివ్వనుంది. అయితే.. రెండో సారి కూడా తనకు ఆడపిల్ల పుడుతుందనే భయం ఆ తల్లిని తీవ్రంగా కలిచివేసింది. అత్తింటి వారు, బంధువుల ఆరళ్లను తట్టుకోవడం కష్టమని బావించింది. మనోవేదనతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. కొన్ని గంటల్లో శిశువుకు ప్రాణం పోయాల్సిన ఆ తల్లి బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన రమ్య (26) మంచిర్యాలకు చెందిన ఆనంద్.. 2017లో వివాహం చేసుకున్నారు. వారికి ఆరాధ్య(3) తొలి సంతానం. ప్రస్తుతం రమ్య నిండు గర్భిణీ. వైద్యులు గురువారం ఆమెకు ప్రసవ తేదీని ఖరారు చేశారు. అయితే.. గతకొద్ది రోజులుగా రెండోసారి కూడా ఆడపిల్లే పుడుతుందని రమ్య దిగాలుగా ఉంటోంది. ఎవ్వరు పుట్టినా ఏమీ కాదని భర్త, అత్తింటివారు, పుట్టింటి వారు ఆమెకు నచ్చజెప్పేవారు. అయినప్పటికీ.. మళ్లీ ఆడపిల్ల పుడితే ఇబ్బందులు తప్పవని బావించిన రమ్య తీవ్ర నిర్ణయం తీసుకుంది.
బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రమ్య కడుపులో నుంచి మృతి చెందిన మగ శిశువును వైద్యులు వెలికితీశారు. ఆడపిల్ల పుడుతుందనుకొని ఆత్మహత్య చేసుకుందని.. గర్భంలో మగబిడ్డ ఉన్నదని తెలిస్తే తమకు కడుపుకోత మిగిల్చేది కాదని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది.