చనిపోయిన మహిళ బతికి వస్తుందని.. మృతదేహం వద్ద మూడు రోజులు ప్రార్థనలు
Prayers at the dead body in Madurai.చనిపోయిన మహిళ బతికివస్తోందన్న మూఢ నమ్మకంతో మూడు రోజుల పాటు మృతదేహం వద్ద
By తోట వంశీ కుమార్ Published on 12 Nov 2022 9:55 AM ISTసైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కూడా ఇంకా కొందరు మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. మనం ఎవరిని ఎంతగా ప్రేమించినా.. ఆ వ్యక్తి మన కన్నా ముందో వెనుకో చనిపోక తప్పదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే.. ఓ కుటుంబం మాత్రం చనిపోయిన మహిళ బతికివస్తోందన్న మూఢ నమ్మకంతో మూడు రోజుల పాటు మృతదేహం వద్ద ప్రార్థనలు చేశారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలకృష్ణన్, మాలతి దంపతులు మదురైలోని ఎస్ఎస్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. బాలకృష్ణ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మేనేజర్‌గా పని చేస్తుండగా.. కుమారులు ఇద్దరు మెడిసిన్ చదువుతున్నారు. ఇటీవల మాలతి అనారోగ్యానికి గురి కాగా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె ఈ నెల 8న ఆస్పత్రిలోనే మరణించింది.
మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఫ్రీజర్ బాక్స్‌లో ఉంచారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. అయితే.. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు బాలకృష్ణ ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ మాలతి కుటుంబీకులు ఆమె మృతదేహం పక్కన కూర్చుని ప్రార్థనలు చేస్తున్నారు. ఇలా చేస్తే మాలతి బతుకుతుందని స్థానికులతో వారు చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని తరలిస్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తాము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు ఎన్ని విధాలుగా వారికి సర్దిచెప్పేందుకు చూసిన వారు మాట వినలేదు. చివరకు అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో మృతదేహాన్ని తిరునెల్వేలి జిల్లా కళకాట్టికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.