ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోరాన్ నివాసి ముఖేష్ పటేల్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. సోమవారం నాడు పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి వినోద్ కుమార్ చౌరాసియా.. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ.. అతనికి 25 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. అలాగే.. మృతురాలి కుటుంబానికి రెండు లక్షల రూపాయల పరిహారం అందించాలని జిల్లా న్యాయ సేవల అథారిటీని కూడా ఆదేశించడం జరిగింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. సోరాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఎనిమిదేళ్ల బాలిక 2024 అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం శివగఢ్ కూడలి సమీపంలోని ఒక పండాల్‌లో దుర్గా పూజ చూసేందుకు వెళ్లింది. ఆ తర్వాత బాలిక అదృశ్యమైంది. మరుసటి రోజు బాలిక నగ్న మృతదేహం ఒక పొలంలో లభ్యమైంది. బాలిక శరీరంపై దారుణంగా హింసించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. బాలిక చేతులు, కాళ్లు, పళ్లు విరిగిపోయాయి, నోటి నుంచి నురుగు వస్తోంది. బాలిక మర్మాంగాలు కూడా తీవ్రంగా గాయపడ్డాయి. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముఖేష్ పటేల్‌పై కేసు నమోదు చేశారు. సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
హత్య, అత్యాచారం, తీవ్రమైన లైంగిక దాడి వంటి ఘోరమైన నేరాలకు నిందితుడు పాల్పడినట్లు దర్యాప్తులో రుజువైంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినయ్, నిందితుడి న్యాయవాది వాదనలు విని, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను సమీక్షించిన అనంతరం కోర్టు 2024 డిసెంబర్ 21న అభియోగాలను నమోదు చేసి, ఘటన జరిగిన 18 నెలల్లోపే సోమవారం నాడు తన చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.