ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌ను హ‌త్య చేసిన ప్ర‌భాస్ అభిమాని.. కారణం తెలిస్తే షాకవుతారు.!

సినీ హీరోలపై ఉన్న అభిమానం హద్దులు దాటింది. దీని కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

By అంజి  Published on  23 April 2023 8:15 AM IST
APnews, Prabhas fan, Pawan Kalyan fan, West Godavari

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌ను హ‌త్య చేసిన ప్ర‌భాస్ అభిమాని.. కారణం తెలిస్తే షాకవుతారు.!

సినీ హీరోలపై ఉన్న అభిమానం హద్దులు దాటింది. దీని కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తన హీరోని తిట్టాడని ఆవేశంతో అభిమాని హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరుకు చెందిన హరికుమార్‌, కిషోర్‌ పెయింటర్స్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ఓ బిల్డింగ్‌ పెయింటింగ్‌ పనుల కోసం అత్తిలి వచ్చారు. పగటి సమయంలో పెయింటింగ్‌ వేస్తున్న బిల్డింగ్‌పైనే రాత్రి సమయాల్లో నిద్రిస్తున్నారు. హరికుమార్‌ ఏలూరులో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌కు సెక్రటరీ. ఇక కిషోర్‌.. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్.

శుక్రవారం నాడు ఇద్దరి మధ్య సినీ హీరోల గురించి వాదన జరిగింది. అప్పటికే ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారు. ఈ క్రమంలోనే హరికుమార్‌ తన స్మార్ట్ ఫోన్‌లో ప్రభాస్‌ వీడియోను వాట్సాప్‌గా పెట్టుకున్నాడు. దీంతో ప్రభాస్‌ వద్దు, పవన్‌ కల్యాణ్‌ వీడియో పెట్టుకోవాలని హరికుమార్‌కు కిషోర్‌ సూచించాడు. మద్యం మత్తులో ఉన్న కిషోర్‌ ప్రభాస్‌ను తిట్టాడు. దీంతో హరికుమార్‌కు విపరీతమైన కోపం వచ్చింది. అక్కడే పక్కన ఉన్న సెంట్రింగ్‌ కర్రతో కిషోర్‌ తలపై కొట్టాడు. సిమెంట్‌ రాయితో ముఖంపై బాదడంతో కిషోర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. హ‌రికుమార్‌ను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story