గత నెలలో మెట్రో కోచ్‌లో పాడు పని చేస్తున్న వ్యక్తి ఫోటోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఆ వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రజల సహాయాన్ని కోరారు. అతడి గురించి వివరాలు ఇచ్చే వారి గుర్తింపు గోప్యంగా ఉంచుతామని ఢిల్లీ మెట్రో డీసీపీ మంగళవారం పోస్ట్ చేసిన ట్వీట్‌లో తెలిపారు. ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (DCW) చీఫ్ స్వాతి మలివాల్ ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేయడంతో వ్యక్తిపై కేసు నమోదైంది.
"ఈ వ్యక్తి ఢిల్లీ మెట్రోలో అసభ్యకర చర్య చేస్తున్నాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దయచేసి వివరాలను 8750871326 లేదా 1511 (కంట్రోల్ రూమ్) లేదా 112 (పోలీస్ హెల్ప్‌లైన్)కు తెలియజేయండి. ఇన్ఫార్మర్ గుర్తింపు గోప్యంగా ఉంచుతాం’’ అని మెట్రో డీసీపీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మెట్రో లోపల లేదా దాని పరిసరాల్లో ఏదైనా అశ్లీల కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర మణి తెలిపారు. ప్రయాణికులు అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని డిఎంఆర్‌సి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు స్టేషన్లలో, మెట్రో కోచ్‌ల లోపల పెట్రోలింగ్‌ను పెంచామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అసభ్యకరమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా ఈ అసభ్య వీడియోలను అప్‌లోడ్ చేసే వ్యక్తులకు కూడా శిక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. మెట్రో ప్రయాణికులు కూడా అసభ్య కార్యకలాపాలు పాల్పడుతున్న వారిని గమనిస్తే.. సమీపంలోని అందుబాటులో ఉన్న మెట్రో సిబ్బంది లేదా CISF సిబ్బందికి వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు.