ఆ దొంగ పోలీసు కొడుకే అని తెలియడంతో.. షాకైన స్థానికులు

Police called to handover thief caught by people turns out to be policemans son. ఓ షాపులో డబ్బులు అపహరించిన దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు.

By అంజి  Published on  28 July 2022 8:45 PM IST
ఆ దొంగ పోలీసు కొడుకే అని తెలియడంతో.. షాకైన స్థానికులు

ఓ షాపులో డబ్బులు అపహరించిన దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. అయితే అక్కడ వచ్చిన పోలీసుల్లో ఓ పోలీసు దొంగను చూసి.. అతడు తన కుమారుడని చెప్పడంతో స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన బీహార్‌ రాజధాని పాట్నాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శాస్త్రినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ బట్టల షాపులో కొన్ని రోజుల కిందట చోరీ జరిగింది. ఓ యువకుడు షాప్‌లోని క్యాష్‌ కౌంటర్‌ నుంచి నగదును దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన షాపు నిర్వాహకులు.. దొంగతనం చేసిన వ్యక్తి దృశ్యాలను పక్క షాపులకు చూపించారు. మళ్లీ ఆ దొంగ వస్తే.. అందరం కలిసి పట్టుకోవాలని నిర్ణయించారు.

అయితే ఆ దొంగ బుధవారం సాయంత్రం మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చాడు. తనను ఎవరూ గుర్తు పట్టరనుకొని ఓ షాపులోకి చొరబడి క్యాష్‌ కౌంటర్‌లోని డబ్బులను అపహరించాడు. దీంతో స్థానిక వ్యాపారులు అతడ్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించేందుకు ఫోన్‌ చేశారు. ఇంతలో అక్కడి వచ్చిన పోలీసుల్లో ఒక పోలీస్‌ ఆ దొంగను చూసి తన కుమారుడిగా గుర్తించాడు. కోపంతో రగిలిపోయి అందరి ముందు అతడిని కొట్టాడు. తానే శిక్షిస్తానంటూ కుమారుడిని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇది చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు.

Next Story