చోరీ చేసేందుకు.. వృద్ధురాలి కంటి చుక్కల్లో టాయిలెట్‌ క్లీనర్‌ కలిపిన మహిళ

Poisoning for theft, Harpic solution instead of eye drops in old woman's eyes. ఓ మహిళ యజమాని ఇంటి నుండి విలువైన వస్తువులను దొంగిలించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న కేర్‌ టేకర్‌ దారుణ చర్యకు

By అంజి  Published on  3 March 2022 1:31 PM IST
చోరీ చేసేందుకు.. వృద్ధురాలి కంటి చుక్కల్లో టాయిలెట్‌ క్లీనర్‌ కలిపిన మహిళ

ఓ మహిళ యజమాని ఇంటి నుండి విలువైన వస్తువులను దొంగిలించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న కేర్‌ టేకర్‌ దారుణ చర్యకు పాల్పడింది. వృద్ధురాలిని అంధురాలిని చేసేందుకు ఐ డ్రాప్స్‌కు బదులుగా హార్పిక్‌ ద్రావణంలో జండుబామ్‌, నీళ్లు కలిపి కళ్లలో వేసింది. ఈ ఘటన నాచారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన పి భార్గవి (32) అనే మహిళ నాచారంలోని స్నేహపురి కాలనీలో పి హేమావతి (73) వద్ద కేర్‌టేకర్‌గా పనిచేస్తోంది. వృద్ధురాలి కంటి చుక్కల్లో టాయిలెట్ క్లీనర్‌, జండుబామ్‌ను కలిపి మహిళ కళ్లలో వేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యజమాని పూర్తిగా అంధురాలిగా మారడంతో భార్గవి రూ. 40 వేలు, లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని బట్టల కింద దాచి వెళ్లిపోయింది.

చివరికి నిందితురాలు పట్టుబడిందిలా..

వృద్ధురాలి కండ్లలో రోజు హార్పిక్ ద్రావ‌ణంతో కూడిన డ్రాప్స్‌ వేయడంతో కళ్లు కనిపించకుండా పోయాయి. కళ్లలో ఇన్పెక్షన్‌ రావడంతో సదరు వృద్ధురాలు తన కుమారుడికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చూపించినా కళ్లలో ఏ మాత్రం పురోగతి కనిపించలేదు. ఆ తర్వాత హేమవతి కుమార్తె ఉషశ్రీ.. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. అయినా ఫలితం లేకపోవడంలో ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లీ పరీక్షలు చేయించగా కంటిలో విషప్రయోగం జరిగిందని తెలిసింది. దీంతో కేర్‌టేకర్‌ భార్గవిపై శశిధర్‌, ఉషశ్రీ అనుమానం వ్యక్తం చేశారు. ఇంట్లో బీరువాను పరిశీలించగా నగలు, డబ్బులు కనిపించలేదు. భార్గవిని ఇదే విషయమై ప్రశ్నిస్తే.. అనుమానిస్తున్నారంటూ ఇంటి నుండి వెళ్లిపోయింది. అయితే నగలు దాచిన బ్యాగు కోసం భార్గవి మళ్లీ నాచారం వచ్చింది. దీంతో పోలీసులు భార్గవిపై అనుమానం వ్యక్తం చేసి, ఆ బ్యాగును తనిఖీ చేయగా నగలు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.

Next Story