రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మధురైలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృందం శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుంది. ట్రాన్సిట్ వారెంట్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. దళిత యువకుడు, గ్రామ వాలంటీర్ జె.దుర్గాప్రసాద్ హత్యకేసులో శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గత కొన్ని రోజులుగా శ్రీకాంత్‌పై నిఘా పెట్టిన పోలీసులు మధురైలో అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందారు. ఆయనను రోడ్డు మార్గంలో కోనసీమ జిల్లాకు తీసుకువస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను శ్రీకాంత్ ఖండించారు. “నేను డాక్టర్‌ని. నాకు ప్రాణాలను కాపాడడం మాత్రమే తెలుసు.. ప్రాణాలు తీయడం కాదు” అని ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు తీసుకువెళుతున్న సమయంలో మధురైలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్ల తర్వాత 2022 జూన్ 6న దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యాడు. పోలీసులు ముందుగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ వి.ధర్మేష్‌ను ప్రశ్నించారు. అక్టోబరు 18న అతడిని అరెస్టు చేశారు. శ్రీకాంత్‌తోపాటు మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు దుర్గాప్రసాద్.. ధర్మేష్, శ్రీకాంత్‌లకు స్నేహితుడు.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. దళిత యువకుడి హత్య వెనుక ఉద్దేశం తెలియరాలేదు. పక్కా ప్రణాళికతో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విశ్వరూప్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2022 మేలో కోనసీమ జిల్లా పేరు మార్చడంపై జరిగిన హింసాకాండ సందర్భంగా అమలాపురంలోని ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. అయితే.. విశ్వరూప్ అతని కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఇంట్లో లేరు.