ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ చోరీ.. రూ. 70 లక్షల విలువైన సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగ..!

Phones Worth ₹70 Stolen From Electronics Showroom.ఓ ఎల‌క్ట్రానిక్స్ షోరూమ్‌కి క‌న్న‌మేసిన దొంగ ఏకంగా రూ.70ల‌క్ష‌ల‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2022 5:07 AM GMT
ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ చోరీ.. రూ. 70 లక్షల విలువైన సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగ..!

ఓ ఎల‌క్ట్రానిక్స్ షోరూమ్‌కి క‌న్న‌మేసిన దొంగ ఏకంగా రూ.70ల‌క్ష‌ల‌ విలువైన సెల్‌ఫోన్ల‌ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న ఈసీఐఎల్ చౌరస్తాలో జ‌రిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేష‌న్‌కు 100 అడుగుల దూరంలో ఈ షోరూమ్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఈసీఐఎల్ చౌరస్తాలో షో రూమ్‌ను అయిదేళ్లుగా నిర్వ‌హిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది. షోరూమ్‌ మూలన ఉన్న వెంటిలేటర్ ఇనుప చువ్వలు, ఫాల్స్ సీలింగ్ తొలగించి దొంగ లోపలికి ప్ర‌వేశించాడు. అనంత‌రం లోప‌ల ఉన్న సీసీ కెమెరాలు ప‌ని చేయ‌కుండా వాటి వైర‌న్లు క‌ట్ చేశాడు. ఐఫోన్, వివో, ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీల‌కు చెందిన దాదాపు 200కుపైగా ఫోన్ల‌ను తీసుకుని పారిపోయాడు. వీటి విలువ సుమారు రూ.70 ల‌క్ష‌లకు పైనే ఉంటుంది.

అయితే.. దొంగ సెల్‌ఫోన్ల‌ను మాత్ర‌మే ఎత్తుకెళ్లాడు. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల జోలికి మాత్రం వెళ్ల‌లేదు. బుధ‌వారం ఉద‌యం షోరూమ్ తెరిచిన అనంత‌రం ఈ విష‌యాన్ని సిబ్బంది గుర్తించారు. సంస్థ జనరల్ మేనేజర్ మహ్మద్ హబీబ్ ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ బృందాలు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఓ సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను బట్టి చోరీకి పాల్పడింది ఒక్కడేనని గుర్తించారు. అతడికి ఇంకెవరైనా సహకరించి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేప‌ట్టారు.

కాగా.. ఇది తెలిసిన వాళ్ల ప‌నేన‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. నేరుగా సెల్‌ఫోన్లు ఉండే చోటు వద్దకు వెళ్లడం ఇందుకు ఊతమిస్తోంది.

Next Story