నార్సింగీలో దారుణం.. స్వైప్‌మిష‌న్‌ ప‌ని చేయ‌ట్లేద‌న్నందుకు చంపేశారు

పెట్రోల్ పంప్‌లో పని చేసే కార్మికుడిపై ముగ్గురు యువ‌కులు దాడి చేశారు. తీవ్ర‌గాయాల‌పాలైన ఆ కార్మికుడు మృతి చెందాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2023 8:50 AM IST
Petrol Bunk, Narsingi

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

రంగారెడ్డి జిల్లా నార్సింగీలో దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ పంప్‌లో పని చేసే కార్మికుడిపై ముగ్గురు యువ‌కులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర‌గాయాల‌పాలైన ఆ కార్మికుడు మృతి చెందాడు.

జ‌న్వాడ‌లోని హెచ్‌పీ పెట్రోల్ పంపులో సంజ‌య్ అనే యువ‌కుడు ప‌ని చేస్తున్నాడు. అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు ఓ కారు పెట్రోల్ పంపు వ‌ద్ద‌కు వ‌చ్చింది. కారులో పెట్రోల్ నింపిన అనంత‌రం న‌గ‌దు చెల్లించాల‌ని క్యాషియ‌ర్ చోటు కారులోని వ్య‌క్తుల‌ను కోర‌గా.. వారు కార్డులు ఇచ్చారు. అయితే.. స్వైప్ మిష‌న్ ప‌ని చేయ‌డం లేద‌ని, క్యాష్ ఇవ్వ‌మ‌ని అడిగాడు.

మాకే ఎదురు మాట్లాడుతారా అంటూ కారులోని ముగ్గురు యువ‌కులు క్యాషియ‌ర్ చోటు పై దాడి చేశారు. చోటును కొట్ట‌వ‌ద్దు అంటూ సంజ‌య్ అడ్డుకున్నాడు. అడ్డువ‌చ్చిన‌ సంజ‌య్ పై పిడిగుద్దుల వ‌ర్షం కురిపించారు. దీంతో సంజ‌య్ అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు.

అప్ప‌టికే కారులో పాటు ముగ్గురు యువ‌కులు అక్క‌డి నుంచి పారిపోయారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story