బాలుడు ఆత్మహత్య.. 'బీమ్లా నాయక్ సినిమా అంట.. టికెట్ కోసం రూ.300 కావాలన్నాడు'
Pawan Kalyan Fan Commits Suicide For Bheemla Nayak.ఇటీవల యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యకు
By తోట వంశీ కుమార్ Published on 15 Feb 2022 1:04 PM ISTఇటీవల యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో, ప్రేమించిన అమ్మాయి కాదని అనిందనో, ఫోన్ కొనివ్వలేదనో.. ఇలా చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. కన్నవాళ్లకు గర్భశోకం మిగులుస్తున్నారు. తాజాగా ఒక బాలుడు.. 'భీమ్లా నాయక్' చిత్రం చూడడానికి తండ్రి నగదు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. పవన్ అభిమాని ఆత్మహత్య అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ మారింది.
వివరాల్లోకి వెళితే.. జగిత్యాలలోని పురానీపేటలో నవదీప్(11) అనే బాలుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. నవదీప్ 8వ తరగతి చదువుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఇక పవన్ నటించిన బీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న విడుదల అవుతుండడంతో.. తొలి రోజు తొలి ఆటనే చూడాలని బావించాడు. ముందుగా టికెట్ బుక్ చేసుకుందామనుకున్నాడు. ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ ఓపెన్ చేశారని స్నేహితుడు చెప్పడంతో సినిమా టికెట్ కోసం రూ.300 కావాలని తండ్రిని అడిగాడు. దిన సరి కూలీగా పని చేస్తున్న తండ్రి కొడుకు కోరికను కాదన్నాడు. ప్రస్తుతం తన వద్ద అంత నగదు లేదని, కొంత సమయం ఇవ్వమని కుమారుడికి నచ్చజెప్పాడు. దీంతో మనస్థాపం చెందిన నవదీప్.. గదిలోకి వెళ్లి లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
'పవన్ నటించిన బీమ్లా నాయక్ సినిమా అంట. ఆ సినిమా టికెట్ కోసం రూ.300 కావాలన్నాడు. టికెట్‌కు రూ.300 ఏంటని కాస్త గట్టిగా అడిగా.. రూ.150 ఎవరికో ఇవ్వాలని మరో రూ.150 టికెట్ కోసమని చెప్పిండు. అంతంటే ఇప్పుడు కష్టం. కొద్ది రోజులు ఆగమని చెప్పా. అంతే.. నువ్వెప్పుడు పైసలియ్యవ్ నాకు అనుకుంటూ కోపంతో గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు. ఎంతసేపు డోర్ కొట్టినా చప్పుడు లేదు. మాకు భయమై తలుపులు బద్ధలు కొట్టి పోయి చూసేసరికి అంతా అయిపోయింది. నా కొడుకు గిట్ల చేస్తడనుకోలేదు.' అంటూ ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. ఆ తల్లిదండ్రుల రోదనలు చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదంతా సినిమాకోసమేనా..? లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉందని అంటున్నారు స్థానికులు.