ఆస్పత్రిలో మద్యం తాగొద్దని అన్నందుకు ఉస్మానియా ఆస్పత్రి భవనంపై నుంచి ఓ రోగి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం వీకర్ సెక్షన్ కాలనీలో నాగరాజు(22), సంతోష దంపతులు నివసిస్తున్నారు. నాగరాజు నిత్యం మద్యం తాగేవాడు. అయితే.. ఏమైందో తెలీదు కానీ.. ఈ నెల 2న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఆస్పత్రి నాలుగో అంతస్థులోని ఎంఎం-2 వార్డులో నాగరాజుకు చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆస్పత్రికి మద్యం తీసుకురావాలని భార్యను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఆస్పత్రిలో మద్యం తాగొద్దని వారించింది. దీంతో నాగరాజు ఆగ్రహానికి లోనైయ్యాడు. భార్యను పక్కకు తోసేసి గది బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత నాలుగో అంతస్తులోని కిటీకి అద్దాలను పగలగొట్టి అందులోంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. గత నాలుగు రోజులుగా అతను మద్యం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడని అంటున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.