మరికొద్ది గంటల్లో పెళ్లి.. కుప్ప కూలిన పెళ్లి కూతురు.. అవయవదానం
Parents donate organs of daughter who died on wedding day in Karnataka.మరికొద్ది గంటల్లో పెళ్లి జరగనుంది.
By తోట వంశీ కుమార్
మరికొద్ది గంటల్లో పెళ్లి జరగనుంది. వివాహానికి ముందు రోజు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వధూ వరులు ఇద్దరూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఈ క్రమంలో వధువు ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే అక్కడ ఉన్న వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయింది. ఆమె కుటుంబ సభ్యులు నవ వధువు అవయవాలను దానం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకా కొడ చెరువు గ్రామంలో రామప్ప తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన కుమారై చైత్ర(26) కైవార కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఆమెకు హోసకోటెకు చెందిన ఓ యువకునితో వివాహాన్ని నిశ్చయించారు. ఈ నెల 7న శ్రీనివాసపురం పట్టణంలోని ఓ కళ్యాణ మండలంలో వీరి వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. 6న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వేదికపై పెళ్లికుమారై, పెళ్లి కొడుకు ఉండగా.. బంధువులు, మిత్రులు వారితో ఫోటోలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో చైత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులు చికిత్స అందించారు. అయితే.. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెప్పారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు అవయవదానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అవయవదానం అనంతరం శనివారం ఆమె భౌతికకాయనికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. ఈ చర్యను రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె. సుధాకర్ అభినందించారు. చైత్ర మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని, వివాహ బంధంతో జీవితాన్ని రూపొందించుకోవాలని కోరుకున్న ఆమె మరణం దురదృష్టకరం అని అన్నారు. ఆమె మరణించినప్పటికి.. అవయవ దానంతో పలువురికి ప్రాణదానం చేయాలన్న వారి కుటుంబ సభ్యుల ఆశయం అభినందయనీయం అని మంత్రి అన్నారు.