విషాదం: ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లతో అప్పులు..యువకుడు సూసైడ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్ గేమింగ్ మత్తు మరో ప్రాణాన్ని బలిగొంది
By - Knakam Karthik |
విషాదం: ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లతో అప్పులు..యువకుడు సూసైడ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్ గేమింగ్ మత్తు మరో ప్రాణాన్ని బలిగొంది. పట్టణంలోని ఓం శాంతి కాలనీకి చెందిన వల్లందేసి శ్రీకర్ (30) అప్పుల భారాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాదిన్నర కాలంగా శ్రీకర్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లకు అలవాటు పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మొదట సరదాగా ప్రారంభమైన ఆట, క్రమేపీ అలవాటుగా మారి చివరకు అతడిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినట్లు తెలుస్తోంది. గేమింగ్‌లో నష్టాలు రావడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు అప్పులు చేయడం మొదలుపెట్టిన శ్రీకర్, దాదాపు రూ.20 లక్షల వరకు అప్పులు చేసినట్టు సమాచారం.
అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీకర్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకర్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల వల్ల యువత మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.