బీజేపీ పార్టీ ఫ్లెక్సీలు కట్టేందుకు పనికి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు కథనం ప్రకారం.... ఉప్పల్ నియోజకవర్గం బిజెపి పార్టీ బహిరంగ సభ ఫ్లెక్సీలను కట్టేందుకు మెదక్ జిల్లా టెక్మోల్ మండల్ ఎల్లుపేట గ్రామానికి చెందిన రాజలింగం (25), నవీన్ (25), భాస్కర్ (26) ముగ్గురు యువకులు పనికి వచ్చారు.
కాప్రా సాకేత్ రోడ్ లోని రాజా వైన్స్ వద్ద ఫ్లెక్సీలు కట్టి రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. గుర్తు తెలియని కారు అత్యంత వేగంగా వచ్చి యువకులను ఢీకొట్టింది. దీంతో రాజలింగం అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు మాత్రం అదే వేగంతో తప్పించుకొని వెళ్ళిపోయింది. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న ప్రయాణికులు గాయపడిన వారిని గుర్తించి స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. కాగా రోడ్డు ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు పోలీసులు సిసి టీవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.