Hyderabad: చైతన్యపురిలో కారు బీభత్సం.. ఒకరు మృతి

చైతన్యపురిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లాడు.

By అంజి  Published on  18 Dec 2023 1:59 PM IST
Chaitanyapuri, Car Accident, Hyderabad

Hyderabad: చైతన్యపురిలో కారు బీభత్సం.. ఒకరు మృతి

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చైతన్యపురిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అనంతరం కారు అదుపుతప్పి కమాన్‌ దిమ్మెను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు యువకులు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉందని సమాచారం. అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

మృతుడిని విశాల్‌గా గుర్తించామన్నారు. ప్రమాదానికి కారణమైన కారు చౌటుప్పల్‌ తహశీల్దార్‌ హరికృష్ణకు చెందినదిగా సమాచారం. ఆయన కుమారుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాద సమయంలో ఎమ్మార్వో కుమారుడు సాయికార్తీక్‌ కారును నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో నలుగురు యువకులను ఉస్మానియా ఆస్పత్రిలో, ఒకరు యశోద ఆసుపత్రిలో, ఇద్దరు ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని , వారు కొలుకుంటే కానీ.. పూర్తి స్థాయిలో వివరాలు తెలుస్తాయని చైతన్య పురి పోలీసులు తెలిపారు. ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.

Next Story