జీవిత చరమాంకంలో తమకు ఆసరాగా ఉంటారు అనుకున్న సంతానం తమ కనుల ముందే ప్రాణాలు వదిలారు. పని చేసేందుకు ఒంట్లో సత్తువ లేక.. బంధువులపై ఆధారపడలేక ఆ వృద్ద దంపతులు దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ సంతానం లేని లోకంలో తమకు ఏం పని ఉందని అనుకున్నారో.. ఏమో తెలీదు. చివరగా ఇష్టదైవాన్ని దర్శించుకోవాలనుకున్నారు. అనుకున్నట్లే స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వేరే రాష్ట్రంలో పరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బిలోలి గ్రామంలో గంగాధర్ (80) మహనందా (75 ) అనే వృద్దదంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే.. కొద్దికాలం క్రితం వీరి ఇద్దరి సంతానం మృత్యువాత పడ్డారు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్న వీరికి ఆసరా లేకుండా పోయింది. పనిచేద్దామనుకున్నా ఒంట్లో ఓపిక సత్తువ లేవు. దిన దిన గండంగా మారింది. దీంతో తమ జీవితాలను చాలించాలనుకున్నారు. చివరి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నారు. వెంటనే మహారాష్ట్ర నుంచి తిరుపతికి వచ్చి.. స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బాసరలోని సరస్వతి అమ్మవారిని సైతం దర్శించుకున్నారు.
అనంతరం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపం లోని కొచ్చరి మైసమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు. వారి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వృద్ద దంపతులు చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి.. పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.