ఒడిశాలోని గజపతి జిల్లాలో మంత్రవిద్యలు చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు కొందరు 35 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి, అతని ప్రైవేట్ భాగాలను ముక్కలు చేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామస్తులు ఆ వ్యక్తిని గొంతు కోసి చంపి, అతని జననాంగాలను కత్తిరించి, మృతదేహాన్ని సమీపంలోని హరభాంగి ఆనకట్టలో పడేశారని తెలిపారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని జలాశయం నుండి వెలికితీసి పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. రెండు వారాల క్రితం గ్రామంలో ఒక మహిళ మరణానికి అతను కారణమని గ్రామస్తులు అనుమానించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మహిళ మరణానికి చేతబడే కారణమని గ్రామస్తులు నమ్మారు. ఈ సంఘటన శనివారం రాత్రి మోహన పోలీస్ స్టేషన్ పరిధిలోని మలసపదర్ గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి 14 మంది గ్రామస్తులను ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు జి ఉదయగిరి సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సురేష్ చంద్ర త్రిపాఠి తెలిపారు. స్థానికుల బెదిరింపులు ఎదుర్కొన్న ఆ వ్యక్తి గతంలో తన కుటుంబంతో కలిసి గ్రామం వదిలి గంజాం జిల్లాలోని తన మామ ఇంటికి వెళ్లాడని, తన పశువులను చూసుకోవాలని తన వదినను కోరాడని పోలీసులు తెలిపారు. బాధితుడు శనివారం తన పశువులు, మేకలను తీసుకెళ్లడానికి గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అతన్ని అపహరించి చంపారు.