ఒడిశా నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన మైనర్ స్నేహితురాలిని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆ యువతిపై అతడు, అతడి నలుగురు స్నేహితులు అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఈ కేసు ఒడిశాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
అసలు ఏం జరిగింది?
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఒక మైనర్ బాలికను ఆమె ప్రియుడు, నలుగురు స్నేహితులు అపహరించారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన ఆగస్టు 4న జరిగింది. ట్యూషన్ క్లాస్‌కు వెళుతుండగా టూర్‌కు వెళ్దామంటూ ఆమెను ప్రలోభపెట్టి ప్రియుడు, అతని స్నేహితులు ఆమెను సమీపంలోని అడవికి తీసుకెళ్లారు.
ఆ తర్వాత, ఆ నలుగురూ ఆమెపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. అయితే, ఆ అమ్మాయి అక్కడి నుండి తప్పించుకుని వెళ్లి తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. ఆ తర్వాత, ఆమె కుటుంబం ఉదాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, ఈ కేసులోని నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా, మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఇదిలా ఉండగా, ఆగస్టు 7న ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఒక గిరిజన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.