వివాహాం అనేది ఎవరి జీవితంలోనైనా ఆనందించే ఓ అతి ముఖ్యమైన వేడుక. ఈ వేడుకలో అనేక ఘట్టాలు ఉంటాయి. అందులో అప్పగింతలు కూడా ఒకటి. అప్పటి వరకు ఎంతో ఆనందంగా సాగిన వివాహ వేడుకలో విషాదం నెలకొంది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా కనిపించిన ఆ నవ వధువుకు అప్పగింతలే ఆఖరి క్షణాలు అయ్యాయి. అప్పగింతల సమయంలో వధువు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అవ్వగా.. వధువు కూడా కన్నవారు బాధపడుతుండడంతో తన కూడా ఏడ్చింది. అతిగా ఏడుస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకరమైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సోనేపూర్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మురళి సాహూ, మేనకా దంపతుల కుమార్తె గుప్తేశ్వరి సాహూకు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్ అనే యువకుడితో గురువారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి అయిన మరుసటి రోజు అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా.. ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. నీరసం కారణంగా ఆమె పడిపోయిందని అందరూ బావించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. అప్పగింతల్లో అతిగా ఏడవడం వల్ల ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయి ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు. నవ వధువు మృతితో ఇరు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.