ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మద్యం తాగించి.. తొమ్మిదో తరగతి బాలికపై బీటెక్ విద్యార్థుల అత్యాచారం
Ninth class school girl Molested by BTech students in Guntur.సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంది.
By తోట వంశీ కుమార్ Published on 20 May 2022 3:18 AM GMTసోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంది. అపరిచితులతో పరిచయాలు పెను ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారింది. ఆ బీటెక్ విద్యార్థి మరో ఇద్దరు విద్యార్థులను బాలికకు పరిచయం చేశాడు. ఓలాడ్జీలో గది అద్దెకు తీసుకుని మద్యం తాగిన ముగ్గురు బీటెక్ విద్యార్థులు బాలికను అక్కడకు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ఇద్దరు విద్యార్థులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు శివారుకు చెందిన ఓ బాలిక(15) ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన డి.గ్రేస్‌బాబు రెండు నెలల క్రితం ఆ బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో తో పరిచయం అయ్యాడు. బీటెక్ చదువుతున్న అతను.. తన ఇద్దరు స్నేహితులైన రిక్కీ, మణికంఠలను ఆ బాలికకు పరిచయం చేశాడు.
కాగా.. పట్టణ శివారులోని ఇన్నర్ రింగ్‌రోడ్‌లో ఓ హోటల్‌లో గది తీసుకుని ముగ్గురు బీటెక్ విద్యార్థులు మద్యం తాగారు. అనంతరం బాలికకు రిక్కీ ఫోన్ చేసి.. గ్రేస్‌బాబు మద్యం తాగి హోటల్‌లో పడిపోయాడని, మీరొస్తేనే అన్నం తింటానని అంటున్నాడని బాలికను నమ్మించాడు. తరువాత బాలిక ఇంటికి వెళ్లాడు. ఇంట్లో బాలిక తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ బాలికను బైక్‌పై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకొచ్చాడు. బాలికకు బలవంతంగా మద్యం తాగించడంతో మత్తులోకి వెళ్లగానే బాలికపై రిక్కీ, మణికంఠలు అత్యాచారానికి పాల్పడ్డారు.
పనులు ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక కనిపించలేదు. చుట్టు పక్కల అంతా వెదికినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు అత్యాచారం అనంతరం బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆ యువకులు బాలికను బైక్‌పై తీసుకువచ్చి ఇంటికి సమీపంలో వదిలివేశారు. బాధితురాలి తల్లి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. హోటల్ సీసీకెమెరా పుటేజీలను సేకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. బాలిక స్నేహితుడు గ్రేస్‌బాబుపై కేసు నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుండగా.. అతడు నేరానికి పాల్పడలేదని నల్లపాడు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.