ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీ.. తొమ్మిది మంది మృతి
Nine killed after lorry and bus ram into each other in Hubbali.కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 24 May 2022 4:40 AM GMT
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు,లారీ ఢీకొన్నాయి ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. హుబ్లి శివారు ప్రాంతంలోని తారిహా బైపాస్ వద్ద మంగళవారం తెల్లవారుజామున కొల్హాపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు, బియ్యం లోడుతో వెలుతున్న లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను హుబ్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 24 మంది బాధితులను హుబ్లీ కమిషనర్ పరామర్శించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.