గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడపిల్లను తల్లిదండ్రులు ఓ పొలంలో పాతిపెట్టేశారు. పసికందు ప్రాణాలతో ఉండగానే ఇంతటి దారుణానికి తెగించారు. ఈ ఘటన సబర్‌కాంతా జిల్లా గంబోయ్ గ్రామంలో చోటు చేసుకుంది. పొలానికి వెళ్లిన రైతుకు భూమిలో కదలికలు రావడాన్ని గమనించాడు. అప్పుడే పుట్టిన పాప చేయి కనిపించడంతో మట్టిని తొలగించి నవజాత శిశువును బయటకు తీశాడు. ఆ వెంటనే పసికందును బయటకు తీసి చికిత్స కోసం హిమంత్నగర్లోని సివిల్ ఆస్పత్రికి తరలించాడు.
పసికందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని వైద్యులు తెలిపారు. భూమిలోపల పాతిపెట్టడం వల్ల పుట్టిన శిశువుకు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని చెబుతున్నారు. అయితే వైద్యులు శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి శైలేష్, తల్లి మంజును అరెస్ట్ చేశారు. పసికందు తల్లిదండ్రులపై పిల్లలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. నిందితులు గాంధీనగర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ 15 రోజుల నుంచి గంభోయ్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. శిశువు బొడ్డు కూడా ఇంకా కోయలేదు. దీంతో పాప పుట్టిన వెంటనే పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.