హైదరాబాద్‌లో కొత్తరకం గంజాయి కలకలం
తెలంగాణలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 12:05 PM ISTహైదరాబాద్‌లో కొత్తరకం గంజాయి కలకలం
తెలంగాణలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. కానీ.. డ్రగ్స్, గంజాయి ముఠా మాత్రం ఏదో విధంగా రాష్ట్రంలోకి వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తరచూ డ్రగ్స్‌ను తరలిస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో కొత్త రకం గంజాయి పట్టుబడింది. అత్యంత ప్రమాదకరమైన ఖుష్ ఓజీ గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తార్నాకలోని లాలాపేట ఫ్లై ఓవర్ వద్ద గంజాయి సప్లయి చేస్తున్న గంజాయి ముఠాను పట్టుకున్నారు.
సాధారణంగా గంజాయి ధర గ్రాముకి రూ.40 వరకు ఉంటుంది. కానీ.. ఈ ప్రత్యేకమైన గంజాయి ధర మాత్రం గ్రాముకి రూ.4వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. హైబ్రిడ్ క్యానబిస్‌గా పిలిచే ఈ రకం గంజాయి ఆఫ్రికా దేశాల నుంచి సముద్ర మార్గంలో లేదా కొరియర్ ద్వారా బెంగళూరుకు తీసుకొస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించి గుట్టుచప్పుడు కాకుండా నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న మహ్మద్ ఖాన్ అలియాస్ అమన్, అబ్దుల్ మహ్మద్ మొబిన్‌లను పట్టుకున్నారు. వారి వద్ద 23 గ్రాముల ప్రత్యేకమైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణలో నెబిల్ నాయక్ కూడా గంజాయిని విక్రయిస్తున్నట్లు తేలడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నెబిల్ నుంచి 10 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఈ హైబ్రిడ్ క్యానబిస్‌ను ఆఫ్రికా, అమెరికా దేశాల్లో పండిస్తారని తెలుస్తోంది. అప్ఘాన్ సరిహద్దుల్లోని హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో కూడా ఇది పండుతుందట. అందుకే దీన్ని ఖుష్, ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (ఓజీ)గా పిలుస్తారు. సాధారణ గంజాయి కన్నా ఎక్కువ మత్తు ఇందులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విదేశాల్లో ఈ రకం గంజాయికి ఎక్కువగా డిమాండ్ ఉందని చెబుతున్నారు. కానీ.. రాష్ట్రంలో హైబ్రిడ్ క్యానబిస్ దొరకడం ఇదే మొదటిసారి అని ఎక్సైశాఖ అధికారులు చెబుతున్నారు.