అతడు దూరం అవుతాడని.. ఆమెను చంపేశారు
New twist in Jeedimetla murder case.ఓ యువకుడు పక్కింట్లో ఉన్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 14 Aug 2021 8:56 AM ISTఓ యువకుడు పక్కింట్లో ఉన్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కుటుంబం ఆర్థిక అవసరాలన్ని చూసేవాడు. ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలిసినా.. డబ్బుల కోసం సైలెంట్‌గానే ఉన్నాడు. ఇటీవల ఆ యువకుడు ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన దగ్గరి నుంచి సదరు పక్కింటి మహిళను దూరం పెట్టాడు. ఆర్థికంగా సాయం చేయడం మానేశాడు. దీని అంతటికి కారణం.. ఆ యువకుడి భార్యనేనని భావించారు. ఆమెను అడ్డుతొలగించుకుంటే తమ పని సులువుగా అవుతుందని భావించి ఆ అమాయకపు మహిళను హత్య చేసి.. ప్రియుడు వచ్చి చంపాడని ఓ కథ అల్లారు దంపతులు. పోలీసుల విచారణలో అసులు నిజం తెలిసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలో ధన్‌బాద్‌కు చెందిన రాజేశ్ వర్మ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. జీడిమెట్ల పరిధిలోని వినాయక్ నగర్‌లో గత ఐదేళ్లుగా నివాసముంటున్నాడు. అతని పక్క గదిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజిత్, రింకు దంపతులుంటున్నారు. ఆటో డ్రైవర్ అయిన సంజిత్ జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో రాజేశ్ వర్మకు, రింకుల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేత సంబంధంగా మారింది. ఆ ఇంటికి కావవాల్సిన అన్ని ఖర్చులు రాజేశ్ వర్మ భరించేవాడు. ఈ విషయం సంజిత్‌కు తెలిసినా డబ్బుల కోసం సైలెంట్‌గా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజేశ్ వర్మ జార్ఖండ్‌కు చెందిన పూజ(21) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.
వివాహం అనంతరం కూడా అదే గదిలో ఉంటున్నాడు. వివాహం జరిగిన తరువాత రాజేశ్ వర్మ రింకును దూరం పెట్టాడు. ఇంటి ఖర్చులకు డబ్బులివ్వడం ఆపేశాడు. పూజ రావడంతోనే తమకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని ఇలాగే ఉంటే రాజేశ్ పూర్తిగా దూరమవుతాడని బావించిన సంజిత్, రింకు దంపతులు.. పూజను హత్య చేసేందుకు పథకం రచించారు. ఈ నెల 10న రాజేశ్ విధులకు వెళ్లిన సమయంలో నిద్రపోతున్న పూజపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశారు. అనంతరం ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె ప్రియుడు, మరో వ్యక్తి వచ్చి గొడవ పడ్డారని.. ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. నిరాకరించడంతో హత్య చేశారని పోలీసులకు ఓ కట్టుకథ చెప్పారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానంతో రింకు, సంజిత్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. తమ నేరాన్ని అంగీకరించారు. వారిద్దరిని అరెస్టె చేసి రిమాండ్‌కు తరలించారు.