పని చేసే ఇంటికే కన్నం.. నేపాలీ గ్యాంగ్‌ అరెస్ట్

హైదరాబాద్‌లో ఓ నేపాలీ గ్యాంగ్‌ పని చేస్తున్న ఇంటికే కన్నం వేసింది.

By Srikanth Gundamalla  Published on  19 July 2023 12:59 PM GMT
Nepal Gang, Arrest, Theft case, CP Anand, Hyderabad,

 పని చేసే ఇంటికే కన్నం.. నేపాలీ గ్యాంగ్‌ అరెస్ట్

హైదరాబాద్‌లో ఓ నేపాలీ గ్యాంగ్‌ పని చేస్తున్న ఇంటికే కన్నం వేసింది. సికింద్రాబాద్‌లోని సింది కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసలు 9 మంది నేపాల్‌ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు.

సికింద్రాబాద్‌లోని సింది కాలనీలో రాహుల్‌ గోయల్‌ అనే వ్యాపారి నివాసం ఉంటున్నారు. అతని ఇంట్లో ఒక నేపాలీ గ్యాంగ్‌ పనికి దిగారు. యజమానలకు నమ్మకం కలిగించేలా వ్యవహరించారు. ఆ తర్వాత యజమాని రాహుల్‌ ఒక రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్‌ హౌజ్కు వెళ్లారు. దాంతో.. అదే అదునుగా భావించిన నేపాలీ గ్యాంగ్‌ ఇంట్లోకి చొరబడ్డారు. రూ.41 లక్షలు నగదు, 2.8 కేజీల బంగారం, 18 వాచ్లు, విదేశీ కరెన్సీ మొత్తం ఐదు కోట్ల విలువ చేసే వాటిని దోచుకొని అక్కడినుండి ఉడాయించారు. వ్యాపారి ఫామ్ హౌస్ నుండి ఇంటికి తిరిగి రావడంతో ఇల్లు గుల్ల అయిందని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

అయితే పోలీసులకు మొదటి నుండి ఇంట్లో పనిచేసిన నేపాలి గ్యాంగ్ పైనే అనుమానం ఉంది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ నేపాలి గ్యాంగ్ యజమాని ఇంట్లో దోచుకున్న అనంతరం పోలీసుల కంటపడకుండా గుట్టుగా తమ దేశానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఎంతో చాకచక్యంగా నేపాలి గ్యాంగ్ ను అరెస్టు పట్టుకున్నారు. వ్యాపారి రాహుల్ గోయల్ ఇంట్లో చోరీకి పాల్పడ్డ మొత్తం 13 మంది నేపాలీల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లుగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

ఇంత పెద్ద చోరీ ఈ మధ్య కాలంలో జరగలేదని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. దోపిడీకి పాల్పడిన నేపాలి గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు శంకర్ మాన్ సింగ్ అలియాస్ కమల్ వ్యాపారి ఇంట్లో సంవత్సరాల తరబడి నమ్మకంగా పనిచేశాడని తెలిపారు. మరో ఇద్దరు కూడా ఐదేళ్లుగా ఇంట్లో పని చేశారు. దాంతో వ్యాపారి కూడా పనివాళ్లని నమ్మారు. ఇటీవల రాహుల్‌ కుటుంబ సభ్యులతో బటయకు వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఇన్నోవా వాహనం లో నేపాల్ బార్డర్ దాటుతుండగా SSB అధికారుల సాయంతో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని సీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సొమ్మును రికవరీ చేశామని హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడించారు.

Next Story