నెల రోజుల్లో వివాహం.. ఇంతలో దారుణ హత్య
Nellore Murder Case.. ఓ యువకుడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. సరిగ్గా నెల రోజుల్లో వివాహం జరగనుంది.
By సుభాష్ Published on 8 Dec 2020 5:56 AM GMTఓ యువకుడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. సరిగ్గా నెల రోజుల్లో వివాహం జరగనుంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ అర్ధరాత్రి ఆ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో బాధిత కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటన నెల్లూరు నగరంలోని కరెంటు ఆఫీసు సెంటర్ కార్‌జోన్ సమీపంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని విక్రమ్ నగర్ చాముండేశ్వరి అపార్ట్‌మెంట్ ప్లాట్ నంబర్ -301లో మల్లిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శంకరమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. నగర పాలక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఆయన మొదటి భార్య సీతారావమ్మ చాలాకాలం కిందట మృతి చెందింది. వారికి ఇద్దరు సంతానం. మొదటి భార్య మరణాంతరం ఆయన శంకరమ్మను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డి (25) ఆయన చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు.
రెండేళ్లుగా సంగంలోని పెడరల్ బ్యాంకులో లోన్స్ ఏజంట్‌గా పని చేస్తున్నాడు. అయితే రవీంద్రనాథ్‌రెడ్డికి గత నెలలో హరనాథపురానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. జనవరి 8వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. అందుకు తగినట్లుగా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 4న రవీంద్రనాథ్‌రెడ్డి విజయవాడ ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. 6న సాయంత్రం విజయవాడ నుంచి ఇంటికి వస్తున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి 12 గంటల సమయంలో ఫోన్ చేసి నెల్లూరుకు సమీపంలో ఉన్నానని, కొద్ది సేపట్లో బస్సు దిగుతానని చెప్పాడు.
ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో రవీందర్‌నాథ్‌రెడ్డి తన తండ్రికి ఫోన్ చేసి కరెంటు ఆఫీసు సెంటర్ కారు జోన్ వద్ద ఉన్నానని, తనను ఎవరో కత్తులతో పొడిచారని, మాట్లాడలేకపోతున్నానని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌లు రెడ్డి తన మేనల్లుడు శ్యామ్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనంతరం భార్య, మేనల్లుడుతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి అక్కడికి వెళ్లేసరికి వేదాయపాళెం ఇన్స్‌పెక్టర్ సుబ్బారావు, ఎస్సై లక్ష్మణరావు లు ఘటన స్థలంలో ఉన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న రవీంద్రనాథ్‌రెడ్డిని జీజీ హెచ్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రవీంద్రనాథ్‌రెడ్డిని హత్య చేయడానికి కారణాలేమై ఉన్నాయి.. అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. హత్య జరిగిన సమయంలో సెల్‌ఫోన్ టవర్ డంప్‌లను పరిశీలిస్తున్నారు. అక్కడి ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. రవీంద్రనాథ్ రెడ్డి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.